

దేశ రైల్వే వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆధునికీకరించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ సాబర్మతి రైల్వే స్టేషన్ నుంచి దేశంలోనే తొలి ఎల్‌ఎన్‌జీ ఆధారిత రైలును ఆదివారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.1,472 కోట్ల విలువైన పలు రైల్వే అభివృద్ధి పనులను కూడా ప్రారంభించారు. 2014 తర్వాత రైల్వేల్లో ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు, వేగవంతమైన రైలు వ్యవస్థలు, ఆధునిక స్టేషన్లు వంటి అనేక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసినట్లు షా తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి, కుంభకోణాలు జరిగాయని ఆయన ఆరోపించారు.
రైల్వేల్లో డీజిల్ వినియోగం 2015-16లో 293 కోట్ల లీటర్ల నుంచి 2024-25లో 108 కోట్ల లీటర్లకు తగ్గిందని షా వెల్లడించారు. 2023-24లో ఒకే ఏడాదిలో 7,188 కిలోమీటర్ల రైల్వే మార్గాలను విద్యుదీకరించామని, మొత్తం నెట్‌వర్క్‌లో 99.6 శాతం విద్యుదీకరణ పూర్తయిందని తెలిపారు. ఎల్‌ఎన్‌జీ రైలు డీజిల్, ద్రవీకృత సహజ వాయువు రెండింటితో నడిచే ద్వంద్వ ఇంధన విధానాన్ని ఉపయోగిస్తుంది. ఇందులో ఎల్‌ఎన్‌జీ ద్వారా డీజిల్ వినియోగంలో సుమారు 40 శాతం వరకు భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల ఇంధన వ్యయం, డీజిల్ వినియోగం, ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యమని రైల్వే అధికారులు తెలిపారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!