

పాకిస్థాన్ నుంచి భద్రతాపరమైన సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో దేశ సరిహద్దు రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థను మోహరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి జమ్మూకశ్మీర్‌లోని 740 కిలోమీటర్ల నియంత్రణ రేఖ వెంట ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు ఓ జాతీయ మీడియా సంస్థ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ వెల్లడించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే సరిహద్దు ప్రాంతాల్లో భారత గగనతల రక్షణ సామర్థ్యం మరింత పెరగనుంది.
ప్రస్తుతం పాకిస్థాన్, చైనా సరిహద్దులను పర్యవేక్షించేలా భారత్ మూడు ఎస్-400 వ్యవస్థలను వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించింది. పంజాబ్-జమ్మూ సెక్టార్, సిక్కిం సెక్టార్, రాజస్థాన్-గుజరాత్ సెక్టార్లలో వీటిని ఏర్పాటు చేసింది. రష్యా నుంచి మరో రెండు ఎస్-400 వ్యవస్థలు భారత్‌కు అందనున్నట్లు నివేదిక పేర్కొంది. వాటిలో ఒకదాన్ని అస్సాంలో మోహరించి, వ్యూహాత్మకంగా కీలకమైన చికెన్స్ నెక్ కారిడార్‌తో పాటు అరుణాచల్‌ప్రదేశ్‌లోని 1,126 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ)కు రక్షణ కల్పించాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఐదో ఎస్-400 వ్యవస్థను జమ్మూకశ్మీర్‌లో ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!