

తెలంగాణలో నెలకొన్న కరవు పరిస్థితులను జాతీయ విపత్తుగా పరిగణించి, రాష్ట్రానికి రూ.30 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో తీర్మానం చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆదివారం గాంధీభవన్‌లో పీఏసీ, రాష్ట్ర కాంగ్రెస్ సలహా కమిటీల సంయుక్త సమావేశం జరిగింది. అనంతరం మంత్రి సీతక్క, ఏఐసీసీ కార్యదర్శులు అజ్మతుల్లా హుస్సేన్, సంపత్‌కుమార్‌లతో కలిసి పొన్నం మీడియాతో మాట్లాడారు. సమావేశంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై పోరాటం తదితర అంశాలకు సంబంధించి నాలుగు ప్రధాన తీర్మానాలు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా బి.ఎం.సందీప్‌ను నియమించిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయనకు స్వాగతం పలికారు. గతంలో రాష్ట్ర ఇన్‌ఛార్జిగా సేవలందించిన మీనాక్షీ నటరాజన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ మరో తీర్మానం చేశారు. జనగణనలో కులగణన చేపడతామని కేంద్రం ప్రకటించినప్పటికీ, ప్రశ్నావళిలో ఓబీసీ కాలమ్‌ను చేర్చకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓబీసీ ఆప్షన్‌ను చేర్చాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసినట్లు పొన్నం వివరించారు.
ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం రాహుల్‌గాంధీ పోరాడుతుంటే, కేంద్రంలోని బీజేపీ నేతలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని సమావేశంలో కాంగ్రెస్ నేతలు విమర్శించినట్లు పొన్నం తెలిపారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకునేందుకు ఇప్పటి నుంచే సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు పార్టీ, ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని పెంచాలని, మండల, గ్రామ, పట్టణ, వార్డు కమిటీలను, అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రజాప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పీఏసీ పిలుపునిచ్చిందన్నారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్ ద్వారా రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని కొత్త ఇన్‌ఛార్జి సందీప్ ప్రశంసించారని, త్వరలో రాష్ట్ర నాయకులతో విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించనున్నారని పొన్నం తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!