

కార్తిక మాసంలో శివాలయాల దర్శనానికి విశేష ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూత లింగాలు, పంచారామ క్షేత్రాలను దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి చెందిన పంచారామ క్షేత్రాల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వెలసిన శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. శ్రీ మహావిష్ణువు ప్రతిష్ఠించిన ఈ క్షేత్రంలో పార్వతీ సమేతుడైన క్షీరారామలింగేశ్వరుడు బ్రహ్మాది సకల దేవతలతో కలిసి కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తాడు. స్థల పురాణం ప్రకారం, తారకాసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి, ఆయన కుమారుడి చేతిలో మాత్రమే మరణం సంభవించేలా వరం పొందాడు. అనంతరం అమృత లింగాన్ని ధరించి దేవతలను బాధించసాగాడు. దీంతో శివపార్వతులకు కుమారస్వామి జన్మించగా, ఆయన తారకాసురుడితో యుద్ధం చేసి అతని కంఠంలోని అమృత లింగాన్ని ఛేదించాడు. ఆ లింగం ఐదు ఖండాలుగా విడిపోయి ఐదు ప్రాంతాల్లో పడటంతో పంచారామ క్షేత్రాలు ఏర్పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. వాటిలో పాలకొల్లులోని క్షీరారామం ఒకటి.
క్షీరారామంలో స్వామివారు సుమారు 18 అంగుళాల ఎత్తు కలిగిన క్షీరవర్ణపు స్వయంభూ శివలింగ రూపంలో దర్శనమిస్తారు. లింగంపై జటామకుటాన్ని పోలిన నిర్మాణం, మూడు చారలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ స్వామిని కొప్పు లింగేశ్వరుడిగా కూడా పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ జనార్దనులు, బ్రహ్మ సరస్వతులు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆంజనేయుడు, వీరభద్రుడు, నవగ్రహాలు తదితర దేవతామూర్తులు కొలువుదీరి ఉంటారు. చాళుక్య భీముని కాలంలో నిర్మించబడిన ఈ ఆలయ రాజగోపురం తొమ్మిది అంతస్తులతో సుమారు 120 అడుగుల ఎత్తు కలిగి విశేష ఆకర్షణగా నిలుస్తుంది. ఆలయంలో రామగుండం పుష్కరిణి కూడా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఏడాది పొడవునా నిత్య పూజలు, కల్యాణోత్సవాలు, అభిషేకాలు జరుగుతుంటాయి. ఉగాది, రథోత్సవం, వినాయక చవితి, శరన్నవరాత్రులు, మహాశివరాత్రి, కార్తిక మాస అభిషేకాలు, జ్వాలాతోరణం వంటి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ కార్తిక మాసంలో పాలకొల్లు క్షీరారామాన్ని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని భక్తులు కోరుకుంటారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!