

తెలంగాణలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు, ప్రపంచ స్థాయి సమస్యలకు పరిష్కారాలు అందించే గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైటెక్ సిటీలో నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ బ్యాక్‌బేస్ ఏర్పాటు చేసిన 30 వేల చదరపు అడుగుల డెవలప్‌మెంట్ సెంటర్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. టెక్నాలజీ, డిజిటల్ బ్యాంకింగ్, ఫిన్‌టెక్ రంగాల్లో హైదరాబాద్ అంతర్జాతీయ సంస్థలకు కీలక గమ్యస్థానంగా ఎదుగుతోందని మంత్రి పేర్కొన్నారు.
గ్లోబల్ కంపెనీల అవసరాలకు అనుగుణంగా అధునాతన డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని, యువతకు భవిష్యత్ సాంకేతిక రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని శ్రీధర్ బాబు తెలిపారు. డిజిటల్ బ్యాంకింగ్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బ్యాక్‌బేస్ కేంద్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు తదుపరి తరం డిజిటల్ బ్యాంకింగ్ పరిష్కారాలు, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను అందించడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ కేంద్రం ద్వారా 300 మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు ఉపాధి లభించనుంది. ప్రారంభోత్సవంలో నెదర్లాండ్స్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ యాన్ క్రెమర్స్, బ్యాక్‌బేస్ సీటీఓ గ్రెగ్ ఫాహి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ రీన్‌హార్డ్ షీల్, ఇండియా సైట్ హెడ్ సురభి శర్మ తదితరులు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!