

హైదరాబాద్ నగరంలో గణేశ్ చవితి ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపులను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, వివిధ ఉత్సవ కమిటీలతో హైదరాబాద్ సిటీ పోలీసులు శుక్రవారం విశ్వేశ్వరయ్య భవన్‌లో సమన్వయ సమావేశం నిర్వహించారు. సీపీ వి.సి. సజ్జనర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అదనపు సీపీలు ఎ. శ్రీనివాస్, తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ (ట్రాఫిక్) డి. జోయల్ డేవిస్‌తో పాటు పలువురు డీసీపీలు పాల్గొన్నారు. గణేశ్ ఉత్సవాలకు హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉందని సజ్జనర్ తెలిపారు. విగ్రహాల ఆగమనం సందర్భంగా అధిక వేగం, వాహనాలపై డ్యాన్సులు, రద్దీ కారణంగా ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నిర్వాహకులు ముందుగానే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ట్రాఫిక్ తక్కువగా ఉండే సమయాల్లో విగ్రహాలను మండపాలకు తరలించాలని కోరారు. ఊరేగింపు మార్గాల్లో విద్యుత్ వైర్లు, చెట్ల కొమ్మలు, రోడ్ల మరమ్మతుల వంటి అడ్డంకులపై జీహెచ్‌ఎంసీ, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేశామని, త్వరలో రూట్ విజిట్లు నిర్వహిస్తామని తెలిపారు.
ప్రతి గణేశ్ మండపం వద్ద నాలుగైదుగురు బాధ్యతాయుతమైన వాలంటీర్లను నియమించి, వారి వివరాలను పోలీస్ యాప్‌లో నమోదు చేయాలని సీపీ సూచించారు. వాలంటీర్లకు ఒకే రంగు దుస్తులు లేదా బ్యాడ్జీలు ఇవ్వడం ద్వారా పోలీసులతో సమన్వయం మెరుగుపడుతుందని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా శబ్ద కాలుష్యంపై ప్రజలు, ముఖ్యంగా ఆసుపత్రుల్లోని రోగులు, వృద్ధుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సౌండ్ సిస్టమ్స్ పరిమితిని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన నిమజ్జనం రోజున ఊరేగింపులను ఉదయమే ప్రారంభించేలా నిర్వాహకులను ప్రోత్సహించాలని కోరారు. ఖైరతాబాద్ బడా గణేష్, బాలాపూర్ వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. పోలీస్ స్టేషన్ల వద్ద అవగాహన బ్యానర్లు ఏర్పాటు చేయడంతోపాటు, అందరి సామూహిక భాగస్వామ్యంతో గణేశ్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా, సురక్షితంగా నిర్వహించాలని పోలీసులు, ఉత్సవ సమితి ప్రతినిధులు పిలుపునిచ్చారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!