

హైదరాబాద్ నగర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. నవంబర్ 10న జరగనున్న ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి హరియాణా నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన భారీ దున్నరాజులు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అఖిల భారత యాదవ సమాజం ప్రతినిధుల కథనం ప్రకారం.. యాదవులను ఐక్యం చేయాలనే ఉద్దేశంతో సుమారు 80 ఏళ్ల క్రితం చౌదరి సలంద్రి మల్లయ్య యాదవ్ ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. నిజాం కాలం నుంచే ఈ వేడుకలు కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోపాలకులను, పశువులను రక్షించిన ఘట్టానికి గుర్తుగా ఈ సంప్రదాయాన్ని నిర్వహిస్తున్నారనే విశ్వాసం కూడా ఉంది. కాలక్రమేణా సదర్ ఉత్సవాలు హైదరాబాద్ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపుగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం వీటిని రాష్ట్ర పండుగగా గుర్తించింది.
ఈ ఏడాది హరియాణా నుంచి కాళీ, యువరాజ్-2, రోలెక్స్ పేర్లతో ప్రసిద్ధి చెందిన దున్నరాజులను తీసుకొచ్చారు. ఇవి సుమారు 6.5 అడుగుల ఎత్తు, 14 అడుగుల పొడవు, 1,500 నుంచి 1,800 కిలోల బరువు కలిగి ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. 2009 నుంచి హరియాణా, పంజాబ్ రాష్ట్రాల నుంచి మేలు జాతి దున్నరాజులను తీసుకొచ్చి ప్రదర్శించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఉత్సవాలకు కొన్ని నెలల ముందుగానే వీటికి తవుడు, జీడిపప్పు, బాదం వంటి పౌష్టికాహారం అందిస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. పండుగ రోజున నూనెతో శరీరాన్ని మెరిపించి, కొమ్ములకు రంగులు వేసి, రిబ్బన్లు, నెమలి ఈకలతో అలంకరిస్తారు. వెనుక కాళ్లపై నిలబడటం వంటి విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. నారాయణగూడ, ముషీరాబాద్, కాచిగూడ, ఖైరతాబాద్, ఎన్టీఆర్ స్టేడియం తదితర ప్రాంతాల్లో జరిగే ఈ వేడుకలకు నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలిరానున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!