

యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు చేసినట్లు ప్రకటించారు. ఎర్ర సముద్ర తీరంలోని జిజాన్, యాన్బు నగరాల్లో ఉన్న ఆరామ్కో చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు హూతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరీఅ తెలిపారు. యెమెన్‌లోని హోదైదాపై సౌదీ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేపట్టినట్లు హూతీలు పేర్కొన్నారు. మరోవైపు చమురు శుద్ధి కేంద్రాల వైపు దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణులను సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి.
సౌదీ అరేబియా-హూతీల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ దాడులు చోటుచేసుకున్నాయి. అంతకుముందు సౌదీ అరేబియాపై నౌకా దిగ్బంధనం విధిస్తున్నట్లు హూతీలు ప్రకటించారు. యెమెన్‌పై విధించినట్లు తాము ఆరోపిస్తున్న దిగ్బంధనానికి ప్రతీకారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తాజా పరిణామాలతో ఎర్ర సముద్రంలో నౌకల రాకపోకలు, చమురు రవాణా భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. హూతీల చర్యలు ప్రాంతీయ అస్థిరతను మరింత పెంచుతాయని బ్రిటన్ కూడా హెచ్చరించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!