

హైడ్రా చేపట్టిన కూల్చివేతల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రైవేటు వ్యక్తులు కాదు, అధికారులే కోర్టులను తప్పుదారి పట్టిస్తున్నారని హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లోని సర్వే నంబర్-60లో ఉన్న 350 గజాల స్థలంలో ప్రహరీ గోడ, వాచ్‌మన్ గదిని హైడ్రా కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ పెమ్మసాని సుధారాణి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. ప్రభుత్వ భూమి రక్షణకు మాత్రమే సమాచారం అందిందని, కూల్చివేతలకు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు లేవని కోర్టు పేర్కొంది.
సర్వే నంబర్-59కు సంబంధించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని సర్వే నంబర్-60లో కూల్చివేతలు జరపడం, సంబంధిత అధికారులు పరస్పరం తప్పుదారి పట్టించుకోవడం పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని హైకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు వెంగళరావునగర్ భూమి వివాదంలో కౌంటర్ దాఖలు చేయడంలో జాప్యం కారణంగా సింగిల్ జడ్జి విధించిన రూ.50 వేల జరిమానాను డివిజన్ బెంచ్ రూ.10 వేలకు తగ్గించింది. రిజిస్ట్రీ అభ్యంతరాల కారణంగా కౌంటర్ ఆలస్యమైందన్న హైడ్రా వాదనను పరిగణనలోకి తీసుకుని ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!