

అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు హేమంత్ కాళ్లపై పోలీసులు కాల్పులు జరిపిన నేపథ్యంలో, తొలగించిన కాలును భద్రపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కాలును భద్రపరచాలంటూ పిటిషనర్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది.
మరోవైపు, ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో విద్యాశాఖ అధికారులను ప్రతివాదులుగా చేర్చాలంటూ పిటిషనర్ వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. నిందితుడి మోకాళ్ల కింది భాగంలో పోలీసులు కాల్పులు జరిపిన ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ మంగళగిరికి చెందిన న్యాయవాది గుండా గోపికృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!