

మచిలీపట్నంలో గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పంపిణీ చేసిన నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అప్పటి ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని), ఆయన కుమారుడు కిట్టూ పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నకిలీ పట్టాలను నాలుగు వారాల్లోపు రద్దు చేసి, తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని అధికార యంత్రాంగాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో తహసీల్దార్ సంతకాలు ఫోర్జరీ చేయడం, రెవెన్యూ రికార్డుల్లో లేని సర్వే నంబర్లతో పట్టాలు ఇవ్వడం వంటి అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ అంశంపై అప్పట్లో ప్రతిపక్ష నేతలు, స్థానిక నాయకులు నిరసనలు చేపట్టి ఆధారాలతో ఫిర్యాదులు చేసినప్పటికీ అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అనంతరం దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు వాస్తవాలను పరిశీలించి నకిలీ పట్టాల రద్దుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోగా, నకిలీ పట్టాలు అందుకున్న లబ్ధిదారుల్లో కూడా ఆందోళన నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!