

డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ముందస్తు జాగ్రత్తలు, పర్యవేక్షణ చర్యలు, అత్యవసర స్పందన వ్యవస్థలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రభావిత దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులపై శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక స్క్రీనింగ్, సర్వైలెన్స్ వ్యవస్థలను మరింత బలోపేతం చేసినట్లు అధికారులు వివరించారు.
ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని 21 రోజుల పాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారిని వెంటనే గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తప్పుడు చిరునామాలు, ఫోన్ నంబర్లు ఇచ్చే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కాంటాక్ట్ ట్రేసింగ్ను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు, విదేశీ భాషల్లో కమ్యూనికేషన్ కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఎబోలా నివారణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని, ప్రజలు అపోహలు నమ్మకుండా అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని మంత్రి సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!