

కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని పీకేఓసీ-2 (ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్) డిప్‌సైడ్ కోల్ బ్లాక్ సింగరేణి సంస్థకు దక్కడం హర్షణీయమని పేర్కొన్నారు. ఇది సింగరేణి సంస్థ ఎన్నో ఏళ్ల కల సాకారం కావడమే కాకుండా, సంస్థ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాలు, అధికారులు, తెలంగాణ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.
ఈ కోల్ బ్లాక్‌లో సుమారు 180 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, సంవత్సరానికి 6 మిలియన్ టన్నుల చొప్పున 25 సంవత్సరాల పాటు తవ్వకాలు నిర్వహించే అవకాశం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. దీని ద్వారా సుమారు 2,000 మందికి ఉపాధి, రూ.43,000 కోట్లకు పైగా ఆదాయం, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10,500 కోట్లకు మించిన ఆదాయం లభిస్తుందని చెప్పారు. సింగరేణికి వరుసగా మూడు బొగ్గు గనులు దక్కడం తెలంగాణ పారిశ్రామికాభివృద్ధి, ఇంధన భద్రత, ఉద్యోగాల కల్పనకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!