

కృత్రిమ మేధ ఆధారంగా సేవలు వేగంగా అందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సంప్రదాయ ప్రభుత్వ సేవల వ్యవస్థలు కూడా మారాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన శతాబ్ది ముగింపు వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ప్రజలు వారాలు, నెలలు వేచి ఉండే పరిస్థితిని కోరుకోవడం లేదని, ఏఐ వేలాది పత్రాలను క్షణాల్లో ప్రాసెస్ చేయగలుగుతున్నప్పుడు ప్రభుత్వాల నుంచి కూడా వేగవంతమైన, రియల్‌టైమ్ పరిష్కారాలను ఆశిస్తున్నారని చెప్పారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సివిల్ సర్వీసెస్ ఎంపిక, నియామక విధానాల్లో మార్పులు రావాలని సూచించారు. అభ్యర్థి విషయ పరిజ్ఞానంతో పాటు ప్రజాసేవలో చేరాలనే ఉద్దేశం, ప్రేరణను కూడా అంచనా వేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజలే పరమావధిగా ఆధునిక పాలనా వ్యవస్థ పనిచేయాలని మోదీ పేర్కొన్నారు. ‘దేశమే ముందు, పౌరులకే ప్రాధాన్యం’ అనే రెండు సూత్రాలను గుర్తుంచుకోవాలని, ప్రజానుకూలత, క్రియాశీలత, సుపరిపాలన ఆధారంగా 21వ శతాబ్దపు పరిపాలనా విధానం ఉండాలని అన్నారు. పరీక్షలు, నియామక ప్రక్రియలను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసే దిశగా పరీక్షల నిర్వహణ సంస్థలు చర్యలు తీసుకోవాలని సూచించారు. సుదీర్ఘంగా పరీక్షల ప్రక్రియ కొనసాగితే అభ్యర్థులపై కోచింగ్ ఫీజులు, అద్దె, రవాణా వంటి అదనపు ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. యూపీఎస్సీ శతాబ్ది సందర్భంగా ప్రత్యేక నాణెం, తపాలా బిళ్లతో పాటు పుస్తకాన్ని కూడా మోదీ ఆవిష్కరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!