

ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివితేనే ఉన్నత లక్ష్యాలను సాధించగలమనే భావనను కొయ్యాడ ప్రణయ్‌కుమార్ తన విజయంతో తప్పని నిరూపించారు. జనగామ జిల్లా రఘునాథ్పల్లికి చెందిన ఆయన సాధారణ కుటుంబంలో జన్మించారు. స్వచ్ఛంద సంస్థలో పనిచేసే తండ్రి ప్రభాకర్ కలెక్టర్లు, ఎస్పీలు ప్రజా సమస్యలను పరిష్కరించే తీరును గమనిస్తూ.. తన పిల్లలు కూడా ఐఏఎస్ కావాలని ఆకాంక్షించేవారు. సివిల్స్ కోసం తన అన్నయ్య ఉదయ్‌కుమార్ చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పటికీ.. వాటి నుంచి ప్రణయ్ ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. నాగారం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన ఆయన, గజ్వేల్ ప్రభుత్వ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈసీఈ పూర్తి చేశారు. అనంతరం జేఎన్టీయూ-హెచ్లో బీటెక్ పూర్తిచేసి యూపీఎస్సీ సివిల్స్‌పై దృష్టి పెట్టారు. కొంతకాలం ఇంటి వద్దే సిద్ధమైన ఆయన.. హైదరాబాద్‌లోని ప్రభుత్వ స్టడీ సెంటర్లో కోచింగ్ తీసుకున్నారు.
2022లో తొలిసారి యూపీఎస్సీ పరీక్ష రాసిన ప్రణయ్‌కుమార్‌కు ఇండియన్ రైల్వేస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ (ఐఆర్ఎంఎస్)లో అవకాశం లభించింది. శిక్షణ పొందుతూనే సివిల్స్‌కు సిద్ధమయ్యారు. 2023లో రెండో ప్రయత్నంలో ఆల్ ఇండియా 554వ ర్యాంకు సాధించి ఐఏఎస్ కలను నెరవేర్చుకున్నారు. తెలంగాణ క్యాడర్‌కు ఎంపికైన ఆయన నారాయణపేట జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. అనంతరం దిల్లీలోని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలో విధులు నిర్వహించారు. సెప్టెంబరు 3న ఉట్నూరు సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడాలని, వైఫల్యాలను చూసి నిరుత్సాహపడకుండా వాటిని అనుభవాలుగా మలుచుకోవాలని యువతకు ప్రణయ్‌కుమార్ సూచిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!