

ప్రముఖ హిందీ దినపత్రిక ‘సన్మార్గ్’ను ప్రచురిస్తున్న సన్మార్గ్ ప్రైవేట్ లిమిటెడ్, ‘తెహల్కా’ మీడియా సంస్థలో 100 శాతం వాటాలను కొనుగోలు చేసింది. తెహల్కా.కామ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను పూర్తిగా సొంతం చేసుకున్నట్లు సన్మార్గ్ గ్రూప్ ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు వెల్లడించింది. ఈ ఒప్పందంతో మ్యాగజైన్ ప్రచురణ, డిజిటల్ మీడియా రంగాల్లోకి సన్మార్గ్ గ్రూప్ అడుగుపెట్టింది. ప్రస్తుతం రెండు వారాలకోసారి వెలువడుతున్న తెహల్కా పత్రికలో మరిన్ని పెట్టుబడులు పెట్టి, దానిని వారపత్రికగా మార్చాలని యాజమాన్యం యోచిస్తోంది. ప్రింట్, డిజిటల్ ఎడిషన్ల ప్రచురణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
2017లో తెహల్కాను కొనుగోలు చేసిన పెట్టుబడిదారుల బృందం నుంచి సన్మార్గ్ ఈ వాటాలను సొంతం చేసుకుంది. సీనియర్ జర్నలిస్ట్ అర్వింద్ చతుర్వేదిని తెహల్కా కొత్త చీఫ్ ఎడిటర్‌గా నియమించింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఎడిటర్ పదవి నుంచి వైదొలిగిన తరుణ్ తేజ్‌పాల్‌కు ప్రస్తుత సంస్థతో లేదా దాని కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. గతంలో తెహల్కాకు సంబంధించిన వ్యాజ్యాలు, ఇతర హామీల బాధ్యతను పాత యాజమాన్య సంస్థ అనంత్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ చూసుకుంటుందని ఒప్పందంలో పేర్కొన్నారు. జీవితకాల చందాదారులకు ప్రింట్, డిజిటల్ కాపీలు యథావిధిగా అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ ప్రజలకు అర్థవంతమైన, నాణ్యమైన జర్నలిజాన్ని అందించడమే తమ లక్ష్యమని సన్మార్గ్ గ్రూప్ తెలిపింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!