

పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రలోకి ప్రవేశించాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి ప్రవహించిన గోదావరి జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. అనంతరం పవిత్ర జలాలను శిరస్సుపై చల్లుకుని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు, మహిళలు, స్థానికులు పుష్పాలతో గోదావరి జలాలకు స్వాగతం పలికారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా తొలి దశలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9.23 లక్షల మందికి తాగునీరు అందించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడంతో ఇక బీళ్లన్నీ పంట పొలాలుగా మారుతాయని అన్నారు. వచ్చే ఏడాదికి సింహాచలం అప్పన్న సన్నిధికి, ఆపై అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం వరకు గోదావరి జలాలను తరలించి వంశధార వరకూ తీసుకెళ్లే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి ఇప్పటివరకు రూ.4,192 కోట్లు ఖర్చు చేశామని, మరో రూ.800 కోట్లతో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటితో పాటు విశాఖ, అనకాపల్లి జిల్లాల పారిశ్రామిక అవసరాలకు 23.44 టీఎంసీల నీటిని తరలించేలా ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!