

హైదరాబాద్లో సెప్టెంబర్ 25న జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా సాగేలా పోలీస్, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, విద్యుత్, ట్రాఫిక్, హైడ్రా, జలమండలి, వైద్య, రవాణా తదితర శాఖలతో సమన్వయం చేస్తూ చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రధాన నిమజ్జన మార్గాలు, ట్రాఫిక్ పరిస్థితులు, విద్యుత్ సరఫరా, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో సుమారు 20 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన మార్గాల్లో 10 వేలకుపైగా సీసీ కెమెరాలు, 24 డ్రోన్లతో నిరంతర నిఘా కొనసాగుతోంది. కీలక నిమజ్జన ప్రాంతాల్లో క్రేన్లు, రెస్క్యూ బృందాలు, శిక్షణ పొందిన ఈతగాళ్లు, బోట్లు, అంబులెన్సులు, పారామెడికల్ సిబ్బంది, ఫైర్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. భక్తులు, మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటిస్తూ, నిర్దేశిత నిమజ్జన ప్రాంతాలను మాత్రమే వినియోగించి అధికారులకు సహకరించాలని ప్రభుత్వం కోరింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!