

ఇటీవల పలు సంస్థలు తమ ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ జిమ్ సభ్యత్వాలు, ఆరోగ్య పరీక్షలు, ఫిట్‌నెస్ కార్యక్రమాలు వంటి ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణ కొరియాలోని ఓ సంస్థ ఉద్యోగులకు వినూత్న ఆఫర్ ప్రకటించింది. రెండు నెలల పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేసే ఉద్యోగులకు గూచీ, చానెల్, ప్రాడా వంటి ఖరీదైన బ్రాండ్లకు చెందిన బహుమతులు అందిస్తామని తెలిపింది. సియోల్‌లోని ఆ సంస్థలో పనిచేస్తున్న భారతీయ మహిళ మాన్సీ అరోరా ఈ వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ద్వారా వెల్లడించారు.
మాన్సీ అరోరా తెలిపిన వివరాల ప్రకారం, ఉద్యోగులు వరుసగా రెండు నెలల పాటు వ్యాయామం చేయడంతో పాటు ప్రతిరోజూ తాము వ్యాయామం చేస్తున్న ఫొటోలు లేదా వీడియోలను టీమ్ లీడర్ లేదా మేనేజర్‌కు పంపాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వారికి లగ్జరీ బ్రాండ్ల వస్తువులను బహుమతులుగా అందిస్తారు. ఉద్యోగుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ, ఫిట్‌నెస్ అలవాట్లను పెంపొందించడమే ఈ ప్రోత్సాహకం ఉద్దేశమని మాన్సీ పేర్కొన్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి సమయం కేటాయించాలనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ ఆఫర్ తనకూ వ్యాయామం ప్రారంభించేందుకు ప్రేరణనిచ్చిందని చెప్పారు. ఆమె వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!