

పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన కుమారుడికి పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త భారీ కానుక అందించారు. పూర్వ్ బర్ధమాన్ జిల్లాకు చెందిన షంషుద్దీన్ తన 15 ఏళ్ల కుమారుడు మహమ్మద్ తల్హాకు రూ.1.62 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ ఎం4 కాంపిటీషన్ కారును బహుమతిగా కొనిచ్చారు. ముంబయిలోని అంధేరీ షోరూంలో ఈ కారును కొనుగోలు చేసి, గల్సీ బ్లాకులోని పరాజ్ గ్రామానికి తీసుకొచ్చారు. ఖరీదైన స్పోర్ట్స్ కారు గ్రామానికి చేరుకోవడంతో దాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తల్హాకు ఎప్పటినుంచో ఈ కారు కొనాలనే కోరిక ఉండగా, పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే తప్పకుండా కొనిస్తానని తండ్రి హామీ ఇచ్చారు. తొమ్మిదో తరగతి ఆర్నెల్ల పరీక్షల్లో మంచి మార్కులు సాధించడంతో షంషుద్దీన్ తన మాట నిలబెట్టుకుంటూ ముంబయికి వెళ్లి కారును కొనుగోలు చేశారు.
ఇదిలా ఉండగా, షంషుద్దీన్ కుటుంబం వద్ద ఇప్పటికే రేంజ్ రోవర్, వోల్వో ఎక్స్‌సీ90, మెర్సిడెస్ బెంజ్, మహీంద్రా థార్, హ్యుందాయ్ అల్కజార్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. తాజాగా కుమారుడికి బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇవ్వడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కొందరు తండ్రి తన కుమారుడి కష్టానికి తగిన ప్రతిఫలం అందించారని ప్రశంసిస్తుండగా, మరికొందరు 15 ఏళ్ల టీనేజర్‌కు ఇంత ఖరీదైన బహుమతి ఇవ్వడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ తండ్రి నిర్ణయం, రూ.కోట్ల విలువైన కారు ప్రస్తుతం నెట్టింట ఆసక్తికర చర్చకు దారితీశాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!