

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి సమీపంలో రైతులు విద్యుత్ కోసం రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేయడంపై బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు మెరుపు ధర్నా నిర్వహించి, ట్రాక్టర్లతో రాస్తారోకో చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పంటలకు సరైన విద్యుత్ అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు 6 నుంచి 8 గంటల విద్యుత్ కూడా సక్రమంగా అందడం లేదని హరీశ్ రావు ఆరోపించారు. సీఎం సొంత గ్రామానికి సమీపంలోనే రైతులు కరెంట్ కోసం రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడితే దాన్ని ప్రజా పాలన అంటారా? అని ప్రశ్నించారు. తెలంగాణలోని రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, రైతుల పొలాలకు 24 గంటల విద్యుత్ అందించాలని బీఆర్‌ఎస్ తరఫున డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!