

ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సంస్థ బిస్లెరీ.. తమ ఉత్పత్తికి సంబంధించిన నీటి నమూనా పరీక్షలపై వివరణ ఇచ్చింది. ఈ వ్యవహారం 2025 సెప్టెంబర్‌లో గోవాలోని బిస్లెరీ తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేసిన ఒక బ్యాచ్‌కు సంబంధించినదని సంస్థ వెల్లడించింది. సెప్టెంబర్ 30న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు ఆ కేంద్రం నుంచి ఆరు నమూనాలను సేకరించగా.. వాటిలో ఐదు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలిందని తెలిపింది. అయితే ఆరో నమూనాలో బ్రోమేట్ స్థాయి లీటరుకు 12 మైక్రోగ్రాములుగా నమోదైందని, అనుమతించిన పరిమితి 10 మైక్రోగ్రాములని పేర్కొంది. దీనిపై 2025 నవంబర్ 22న బిస్లెరీ అప్పీల్ చేయడంతో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆ నమూనాను రిఫరల్ ల్యాబ్‌కు పంపించింది. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో బ్రోమేట్ స్థాయి అనుమతించిన పరిమితిలోనే ఉన్నట్లు తేలిందని, అదే సమయంలో పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు గుర్తించారని సంస్థ వివరించింది.
రెండు పరీక్షల్లో వచ్చిన ఫలితాల మధ్య వ్యత్యాసంపై స్పష్టత అవసరమని భావించిన బిస్లెరీ.. అదే నమూనాను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆమోదించిన మరో ప్రయోగశాలలో స్వతంత్రంగా పరీక్షించినట్లు తెలిపింది. ఆ పరీక్షలోనూ బ్రోమేట్ స్థాయి నిర్దేశిత పరిమితిలోనే ఉన్నట్లు వెల్లడించింది. ఈ నివేదిక సమర్పించిన తర్వాత ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని, అందువల్ల ఈ వ్యవహారం ముగిసిందని భావించినట్లు సంస్థ పేర్కొంది. ఇప్పటివరకు ఈ అంశంపై ఈమెయిల్ లేదా భౌతిక రూపంలో ఎలాంటి నోటీసు అందలేదని, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వెబ్‌సైట్‌లోనూ సంబంధిత నోటీసును గుర్తించలేకపోయామని తెలిపింది. తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, పది దశల తయారీ ప్రక్రియలో 90కి పైగా నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్నామని బిస్లెరీ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తో తగిన నియంత్రణ ప్రక్రియలో సహకరిస్తామని వెల్లడించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!