

ప్రజలకు సమాన అవకాశాలు, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో సత్తా చాటింది. యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ (AEI)–2026లో దేశంలోని 28 రాష్ట్రాల్లో 0.66 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ న్యూ ఎకనామిక్స్ స్టడీస్ (CNES) రూపొందించిన ఈ నివేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. గోవా 0.68 స్కోరుతో మొదటి స్థానంలో ఉండగా, సిక్కిం, కేరళ, తమిళనాడు, తెలంగాణ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ముఖ్యంగా సామాజిక, ఆర్థిక భద్రత విభాగంలో ఏపీ 0.69 స్కోరుతో దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించింది. ప్రాథమిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, సామాజిక-ఆర్థిక భద్రత, న్యాయ సేవలు అనే ఐదు ప్రధాన అంశాలతో పాటు 23 విభాగాల్లోని 60 సూచికల ఆధారంగా ఈ ఇండెక్స్‌ను రూపొందించారు. మిగిలిన నాలుగు విభాగాల్లోనూ ఏపీ అగ్రరాష్ట్రాల జాబితాలో నిలిచింది.
తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉన్నప్పటికీ, ప్రజలకు అవకాశాలు కల్పించడంలో రెండో స్థానం సాధించడం విశేషమని నివేదిక వెల్లడించింది. రాష్ట్ర ఆర్థిక స్థాయిని బట్టి అంచనా వేసిన యాక్సెస్ స్కోరు 0.51 కాగా, వాస్తవ స్కోరు 0.66గా నమోదైంది. అంటే ఆదాయ స్థాయికి మించి 0.15 పాయింట్ల మెరుగైన ఫలితాన్ని సాధించింది. ఈ సానుకూల వ్యత్యాసం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే అత్యధికంగా నమోదైంది. తాగునీరు, పారిశుద్ధ్యం, గృహవసతి, విద్య, వైద్యం, ఉపాధి, బ్యాంకింగ్, బీమా, పింఛన్లు, న్యాయ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండటాన్ని ఈ సూచీ పరిగణనలోకి తీసుకుంది. పెట్టుబడుల ఆకర్షణతో పాటు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు, సమాన అవకాశాలు అందించడంలో రాష్ట్రం సాధించిన పురోగతికి ఈ ర్యాంకింగ్ నిదర్శనమని పేర్కొంటూ, ఇందుకు కృషి చేసిన వారిని అభినందించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!