

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు నెల రోజుల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో గురువారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నోటిఫికేషన్ విడుదల నుంచి అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చే వరకు ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలే లక్ష్యంగా ‘మిషన్ మార్చ్’ను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
పాఠశాలల నుంచి విద్యార్థుల డ్రాప్‌అవుట్‌లను నివారించేందుకు కమ్యూనిటీ లీడర్లను భాగస్వాములను చేస్తూ ‘జీరో డ్రాప్‌అవుట్ మిషన్’ చేపట్టాలని లోకేశ్ సూచించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా ‘డ్రగ్స్ వద్దు బ్రో’ వంటి కార్యక్రమాలను కొనసాగించాలని తెలిపారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 పాఠశాలలను ‘లీప్ స్కూల్స్’గా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, విశ్వవిద్యాలయాల్లో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 125 ప్రాంతాల్లో ఆటిజం కేంద్రాల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!