

ఎల్‌నినో ప్రభావంతో దక్షిణ భారతంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడి తీవ్ర వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. అరేబియా సముద్రం నుంచి తేమగాలుల రాక నిలిచిపోవడంతో పడమర భారతం నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మీదుగా కోస్తాంధ్ర వైపు పొడిగాలులు వీస్తున్నాయి. దీంతో కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. తిరుపతిలో 39.4, నెల్లూరులో 39.2, కావలిలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వాతావరణ శాఖ ప్రకారం రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో ఎండల తీవ్రత కొనసాగనుంది. అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్‌నినో ప్రభావిత సంవత్సరాల్లో వర్షాలు తగ్గడంతో ఈ నెలలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణుడు తెలిపారు. 1972, 1997, 2002, 2009 సంవత్సరాల్లోనూ ఇలాంటి పరిస్థితులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత మరో ఐదారు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!