

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాసంపై మంగళవారం డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. సాయంత్రం 5.45 గంటల సమయంలో కవిత ఇంటి పరిసరాల్లో డ్రోన్ అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. ఆ సమయంలో కవిత ఇంట్లోనే ఉండటంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అక్కడే ఉన్న పార్టీ శ్రేణులు కూడా ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై కవిత కార్యాలయ సిబ్బంది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఎస్. సుహాసన్ వివరణ ఇచ్చారు. కవిత నివాసంపై కనిపించిన డ్రోన్ పోలీసు శాఖకు చెందిన అధికారిక డ్రోన్ అని స్పష్టం చేశారు. బంజారాహిల్స్ ప్రాంతంలో ప్రముఖుల భద్రత, బందోబస్తు ఏర్పాట్లు, ఇతర రూట్‌మ్యాప్ వివరాలను పరిశీలించేందుకు దాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. పోలీసు విభాగం పర్యవేక్షణలో ఎగురుతున్న డ్రోన్ కవిత నివాసం మీదుగా వెళ్లడంతో అక్కడి వారు ఆందోళనకు గురై ఉండొచ్చని పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!