

ఆంధ్రప్రదేశ్లోని ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. కార్తిక మాసంలో శివాలయాలను దర్శించుకోవడం పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు. అలాంటి పవిత్రమైన క్షేత్రాల్లో ద్రాక్షారామానికి ప్రత్యేక స్థానం ఉంది. స్కంద పురాణం ప్రకారం, తారకాసురుడి కంఠంలో ఉన్న ఆత్మలింగాన్ని కుమారస్వామి ఛేదించడంతో అది ఐదు ముక్కలుగా విడిపోయింది. దేవతలు ఆ ఐదు భాగాలను ఐదు ప్రాంతాల్లో ప్రతిష్ఠించారని, అవే పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయని పురాణ కథనం. వీటిలో నాలుగు గోదావరి నది పరిసరాల్లో, మరొకటి కృష్ణా నది తీరంలో ఉన్నాయి.
పంచారామాల్లో ప్రధానమైన క్షేత్రంగా ద్రాక్షారామాన్ని భావిస్తారు. దక్షప్రజాపతి ఇక్కడ యజ్ఞం నిర్వహించాడనే పురాణ కథనం ఆధారంగా ఈ ప్రాంతానికి ద్రాక్షారామం అనే పేరు వచ్చిందని చెబుతారు. రెండు అంతస్తుల గర్భాలయంలో సుమారు 60 అడుగుల ఎత్తు ఉన్నట్లు చెప్పబడే శివలింగం కొలువై ఉంది. ఈ లింగం తెలుపు, నలుపు రంగుల్లో కనిపించడం ప్రత్యేకత. రెండో అంతస్తు నుంచి స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడి శివుడిని భీమేశ్వర స్వామిగా, అమ్మవారిని మాణిక్యాంబగా పూజిస్తారు. అష్టాదశ శక్తి పీఠాల్లో మాణిక్యాంబ ఆలయం కూడా ఒకటిగా ప్రసిద్ధి చెందింది. శాసనాల ప్రకారం ఈ ఆలయం క్రీస్తుశకం 892 నుంచి 922 మధ్య తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మితమైనట్లు తెలుస్తోంది. ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీ, వ్యాస కాశీ అని కూడా పిలుస్తారు. కార్తిక మాసంలో ఇక్కడి భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే భోగభాగ్యాలతో పాటు మోక్షం లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రం కాకినాడకు సుమారు 32 కిలోమీటర్లు, రాజమండ్రికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!