

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ని ఆదేశించింది. దిశా కుటుంబ సభ్యులు హత్యపై అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ, కేసును కేవలం ప్రమాదవశాత్తు మృతి (ADR)గా ఎందుకు పరిగణించారని కోర్టు ప్రశ్నించింది. అలాగే ఇన్నేళ్లు గడిచినా పోస్టుమార్టం నివేదికను కుటుంబ సభ్యులకు అందించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. మాల్వాణి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంబంధిత రికార్డులన్నింటినీ సీబీఐకి అప్పగించాలని ఆదేశిస్తూ, తగిన ఆధారాలు లభించే వరకు ఎవరినీ నిందితులుగా పరిగణించరాదని స్పష్టం చేసింది.
దిశా తండ్రి సతీష్ సాలియన్ తన కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. కేసు నమోదు చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా రాజకీయ నాయకులపై వచ్చిన ఫిర్యాదులు, రాజకీయ ఆరోపణలతో తమకు సంబంధం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక తండ్రి ఆవేదనను, న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని చట్టబద్ధమైన, పారదర్శకమైన దర్యాప్తు జరిపి సరైన ముగింపునకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొంది. 2020 జూన్ 8న ముంబైలోని మాలాడ్‌లో ఓ భవనం నుంచి పడి దిశా సాలియన్ మృతి చెందారు. ఆరు రోజుల తర్వాత జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన నివాసంలో మృతిచెందడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకవేళ సీబీఐ ప్రతికూల నివేదిక సమర్పిస్తే దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ‘ప్రొటెస్ట్ పిటిషన్’ దాఖలు చేసే హక్కు పిటిషనర్‌కు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!