

మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ ఎంపీల సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర ప్రయోజనాలే ప్రభుత్వ ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, హక్కులను సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎంపీలు ఇచ్చిన ప్రతి సూచనను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ఆయన, కేంద్రానికి పంపిన లేఖలు, పెండింగ్ అంశాలన్నింటినీ సమగ్రంగా సిద్ధం చేసి ఎంపీలకు అందించాలని సూచించారు.
రాష్ట్రానికి ఐఐఎం, ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను సాధించడంతో పాటు, సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, రైల్వే నెట్వర్క్ విస్తరణ, హైదరాబాద్కు సెమీకండక్టర్ ప్రాజెక్టు తీసుకురావడంపై సమిష్టిగా కృషి చేయాలని ఎంపీలకు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అలాగే సత్తుపల్లి, కోయగూడెం బొగ్గు బ్లాకులను వేలం లేకుండా సింగరేణికే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ఎన్నిసార్లైనా కలిసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!