

ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ విశాఖపట్నంలో తన శాటిలైట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. భారతదేశంలోని టైర్-2 నగరాల్లో కార్యకలాపాలను విస్తరించడంపై సంస్థ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఇటీవల డెలాయిట్ సీఈవో రోమల్ శెట్టి వెల్లడించారు. ఈ ప్రణాళికలో భాగంగా విశాఖ రుషికొండ ఐటీ హిల్స్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సంస్థ అడుగులు వేస్తోంది. విశాఖపట్నం, మంగళూరు, గిఫ్ట్ సిటీ వంటి నగరాలకు మారడానికి ఆసక్తి ఉన్న ఉద్యోగులు తెలియజేయాలని సంస్థ తాజాగా ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపినట్లు సమాచారం.
విశాఖ కేంద్రంగా ఐటీ కన్సల్టింగ్, టెక్నాలజీ సేవలు, గ్లోబల్ ఫైనాన్స్, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ (బీపీవో) కార్యకలాపాలను ప్రారంభించేందుకు డెలాయిట్ సిద్ధమవుతోంది. ఇది విశాఖ ఐటీ రంగ అభివృద్ధికి కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఇప్పటికే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ సంస్థలు విశాఖలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. డెలాయిట్ కూడా చేరడం ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ రంగానికి మరింత బలాన్నిస్తుందని రుషికొండ ఐటీ పార్క్ ఉపాధ్యక్షుడు ఒ. నరేశ్ కుమార్ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!