
జనరల్

స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రధాన వేడుకలు జరిగే ఎర్రకోట చుట్టూ బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులు నగరవ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టడంతో పాటు కీలక ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని పెద్ద సంఖ్యలో మోహరించారు.
ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో సుమారు వెయ్యి సీసీ కెమెరాలతో నిఘా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ప్రవేశ మార్గాలు, సున్నిత ప్రాంతాలు, రద్దీ ప్రదేశాలపై భద్రతా బలగాలు ప్రత్యేక దృష్టి సారించాయి. మరోవైపు జమ్మూకశ్మీర్‌లోనూ భద్రతా బలగాలు నిఘాను పెంచాయి. అనుమానాస్పద కదలికలు, కార్యకలాపాలపై నిఘా ఉంచుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!