

కొత్త నేర చట్టాలైన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్‌ఏ) అమలులో డిజిటల్ వేదికల వినియోగం, వివిధ విభాగాల మధ్య సమన్వయం కీలకమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు. నేరం నమోదైనప్పటి నుంచి దర్యాప్తు, ఫోరెన్సిక్ పరీక్షలు, ప్రాసిక్యూషన్, కోర్టు విచారణ వరకు ప్రతి దశలో సమన్వయంతో పనిచేసినప్పుడే వేగవంతమైన న్యాయం అందుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జ్యుడీషియల్ అకాడమీ, పోలీసు శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని జ్యుడీషియల్ అకాడమీలో సదస్సు నిర్వహించారు.
దేశంలోనే తొలిసారిగా కొత్త నేర చట్టాల డిజిటల్ అమలుకు సంబంధించిన అన్ని భాగస్వామ్య సంస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన కార్యక్రమంగా ఇది నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 1,200 మంది న్యాయాధికారులు, పోలీసులు, ప్రాసిక్యూషన్, జైళ్లు, ఫోరెన్సిక్, వైద్య విభాగాల అధికారులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో పాల్గొన్నారు. జ్యుడీషియల్ అకాడమీ చైర్‌పర్సన్ జస్టిస్ మౌషుమి భట్టాచార్య సాంకేతికతతో ప్రక్రియలను సరళీకరించాలని సూచించగా, డీజీపీ సీవీ ఆనంద్ డిజిటల్ ఆధారాలతో శాస్త్రీయ దర్యాప్తు ద్వారా ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యమన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!