

అమెరికా మిస్సౌరీ సెనేటర్ ఎరిక్ ష్మిట్ హెచ్1బీ వీసా వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. హెచ్1బీ సహా ఇతర వీసాల ద్వారా భారతీయులు అమెరికన్ల ఉద్యోగాలను తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా “వీసా కార్టెల్” నడుస్తోందని పేర్కొంటూ, హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని “వీసా దేవాలయం”గా అభివర్ణించడం చర్చనీయాంశమైంది. హెచ్1బీ, ఎల్1, ఎఫ్1, ఓపీటీ వంటి వీసాలు అమెరికా వేతన వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్నాయని, స్థానిక ఉద్యోగ అవకాశాలను ప్రభావితం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.
మరో ట్వీట్లో భారతీయ విద్యార్థులపై కూడా ష్మిట్ విమర్శలు చేశారు. విదేశీ విద్యార్థుల్లో పెద్ద సంఖ్యలో భారతీయులే ఉన్నారని, వారు పన్ను చెల్లింపుదారుల నిధులతో రాయితీ వర్క్ పర్మిట్లు పొందుతున్నారని అన్నారు. చదువు పూర్తయ్యాక హెచ్1బీ, తరువాత గ్రీన్ కార్డు పొందడం ద్వారా అమెరికన్ గ్రాడ్యుయేట్లకు పోటీగా మారుతున్నారని వ్యాఖ్యానించారు. వీసా కార్టెల్ ఇంటర్వ్యూ ప్రశ్నలను పంచుకుంటుందని, పెద్ద టెక్ కంపెనీలు విదేశీ ఉద్యోగులను ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు వలస విధానం, ఉద్యోగావకాశాలపై తీవ్ర చర్చకు దారితీశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!