

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన రెండో రోజున పలు అభివృద్ధి, వైద్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుప్పం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్, డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించి వైద్య సేవలను సమీక్షించారు. రోజుకు 30 నుంచి 40 మందికి సీటీ స్కాన్ సేవలు అందించే సామర్థ్యం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ఆస్పత్రిని పరిశీలించిన చంద్రబాబు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, చెత్తను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.
సంజీవని ప్రాజెక్టు అమలులో డేటా ఇంటిగ్రేషన్, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్ అత్యంత కీలకమని సీఎం పేర్కొన్నారు. డయాలసిస్ వార్డును సందర్శించి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రోగులు వస్తున్నారని తెలుసుకున్నారు. పంచతత్వ కాన్సెప్ట్‌తో రూపొందించిన వాకింగ్ ట్రాక్‌ను పరిశీలించి మొక్క నాటారు. అనంతరం స్వర్ణ కుప్పం–స్వచ్ఛ కుప్పం ఎంట్రన్స్ ఆర్చ్‌ను ప్రారంభించారు. వైద్య రంగ ఆవిష్కరణల ప్రదర్శనను సందర్శించిన ఆయన, డ్రగ్స్ మరియు గంజాయి నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో వైద్యులకు వెంటనే సమాచారం చేరే పరికరాన్ని రూపొందించిన విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!