

తమిళనాడు మత్స్యకారుల బోటు సముద్రంలో మునిగి పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మురసు తుపాను ప్రభావంతో సముద్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్న సమయంలో ఈ ప్రమాదం జరగడం బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన ఈ బోటులో మొత్తం తొమ్మిది మంది మత్స్యకారులు ప్రయాణించగా, ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు సీఎంకు వివరించారు. మరో ఇద్దరు గల్లంతైనట్లు వెల్లడించారు.
గత మూడు రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. గల్లంతైన మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తీర రక్షక దళం, సముద్ర తీర పోలీసులు, స్థానిక మత్స్యకారుల బృందాలు, ఇతర సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మృతదేహాలకు అవసరమైన వైద్య, ఇతర ప్రక్రియలను త్వరగా పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆదేశించారు. మృతులు తమిళనాడుకు చెందినవారు కావడంతో అక్కడి అధికారులతో సమన్వయం చేసుకుని మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!