

ఈ నెల 8న దీపావళి పండుగను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి జరుపుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు వెళ్లి లబ్ధిదారుల కుటుంబాలతో పండుగ ఆనందాన్ని పంచుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు సొంత ఇళ్లు అందించడం సంతోషకరమైన పరిణామమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న సమయంలో వారితో కలిసి దీపావళి జరుపుకోవాలని కోరారు.
గ్రామీణ ప్రాంతాల్లో రెండు విడతల్లో ఇళ్లను మంజూరు చేసినట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్‌లో లక్ష ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయిందని, కొన్ని ఇళ్లలో ఇప్పటికే గృహప్రవేశాలు కూడా జరిగాయని పేర్కొన్నారు. పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరడం గొప్ప విషయమని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇందిరమ్మ ఇళ్లలోనే లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!