

కర్ణాటక సంగీత రంగానికి చెందిన ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు హెచ్.ఎన్. భాస్కర్ అమెరికాలో అరెస్టు కావడం సంగీత ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. మైనర్‌పై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో ఆయన అరెస్టు కావడంతో ఈ వ్యవహారంపై గాయని చిన్మయి శ్రీపాద స్పందించారు. ‘ఎక్స్’ వేదికగా వరుస పోస్టులు చేస్తూ బాధితులకు మద్దతు తెలిపారు. ఈ వ్యవహారంపై తనకు పలువురు బాధితుల నుంచి సందేశాలు వస్తున్నాయని వెల్లడించారు. ఈ వయోలిన్ విద్వాంసుడికి సంబంధించి గతంలోనూ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయని, అయితే బాధితుల వ్యక్తిగత వివరాలు, వారి కథలు, స్క్రీన్‌షాట్లను వారి అనుమతి లేకుండా బహిర్గతం చేయలేనని చిన్మయి పేర్కొన్నారు.
కర్ణాటక సంగీత రంగానికి చెందిన వారు, ముఖ్యంగా ఆయనతో కలిసి పనిచేసిన మహిళలు కూడా ఈ ఆరోపణలపై బహిరంగంగా స్పందించకపోవడం బాధాకరమని చిన్మయి అభిప్రాయపడ్డారు. బాధితులు చాలా చిన్న వయసు వారని, కొన్ని కేసులు పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. బాధితులకు సరైన న్యాయసహాయం అందేలా తాను సహకరిస్తానని, సున్నితంగా వ్యవహరించే న్యాయవాదులతో సంప్రదింపులు జరిపిస్తానని హామీ ఇచ్చారు. బాధితులంతా ధైర్యంగా ముందుకొచ్చి ఒక్కటై ఫిర్యాదులు నమోదు చేయాలని కోరారు. ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించేందుకు ధైర్యం చూపిన బాధితులకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె.. న్యాయం కోసం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!