

చెన్నైకి చెందిన ఓ ఐటీ డెలివరీ మేనేజర్ రెడ్డిట్‌లో పంచుకున్న భావోద్వేగ పోస్టు కార్పొరేట్ ఉద్యోగ కోతల వెనుక ఉన్న మానవీయ కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. సీనియర్ యాజమాన్యం తనను ప్రత్యేక సమావేశానికి పిలిచి, 12 మంది ఉద్యోగుల పేర్లతో ఉన్న ఎక్సెల్ షీట్ ఇచ్చిందని ఆయన వెల్లడించారు. ఒక్కొక్కరితో 15 నిమిషాల సమావేశం నిర్వహించి, వారికి ఉద్యోగం లేదని తెలియజేయాలని, ఈ ప్రక్రియను శుక్రవారంలోగా పూర్తి చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. అయితే, ఆ 12 మంది తనకు కేవలం టీమ్ సభ్యులు మాత్రమే కాదని వివరించారు. 2016 నుంచి కలిసి పనిచేస్తున్న వారితో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని, రాత్రి 3 గంటల వరకు సాంకేతిక సమస్యలను పరిష్కరించడం, కలిసి టీ తాగడం, భోజనం చేయడం, ఒకరి పెళ్లిళ్లకు మరొకరు హాజరుకావడం వంటి అనుభవాలను గుర్తుచేసుకున్నారు. వారు తనను 'సర్' లేదా 'మేనేజర్' అని కాకుండా ఆప్యాయంగా 'అన్నా' అని పిలిచేవారని తెలిపారు.
కొంతమంది ఉద్యోగుల కుటుంబ పరిస్థితులు తనను మరింత కలచివేశాయని మేనేజర్ పేర్కొన్నారు. ఒక ఉద్యోగి నాలుగు నెలల క్రితమే భారీ హోమ్ లోన్ తీసుకోగా, మరొకరు తన తల్లి క్యాన్సర్ చికిత్స కోసం కంపెనీ ఆరోగ్య బీమాపై ఆధారపడ్డారని తెలిపారు. ఇంకొక ఉద్యోగి భార్య వచ్చే నెలలో ప్రసవించాల్సి ఉందని వెల్లడించారు. ఉద్యోగం కోల్పోవడం వల్ల వారి ఈఎంఐలు, వైద్య ఖర్చులు, కుటుంబ బాధ్యతలపై ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆదేశాలను అమలు చేయడం కంటే రాజీనామా చేయాలని కూడా ఆలోచించినట్లు చెప్పారు. అయితే, తాను వెళ్లిపోయినా తొలగింపుల నిర్ణయం మారదని, మరొకరు అదే పని చేస్తారని తన భార్య గుర్తుచేసినట్లు వివరించారు. ఖర్చులు తగ్గించాలనే నిర్ణయాలు ఉన్నతాధికారులు తీసుకుంటే, వాటి బాధ్యతను ఉద్యోగులకు తెలియజేయాల్సిన పరిస్థితి మధ్యస్థాయి మేనేజర్లపై పడుతోందని ఆయన ప్రశ్నించారు. కంపెనీలకు ఇవి కేవలం ఉద్యోగాల సంఖ్యగా కనిపించినా, వాటి వెనుక కుటుంబాలు, అప్పులు, వైద్య అవసరాలు, ఎన్నో ఆశలు ఉంటాయని ఈ పోస్టు చర్చకు తెచ్చింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!