

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో డీప్‌ఫేక్ వీడియోలు, బాలలపై లైంగిక వేధింపుల మెటీరియల్ (CSAM)కు సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం మెటా ప్రతినిధుల బృందంతో చర్చలు జరిపింది. డీప్‌ఫేక్ కంటెంట్‌పై సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని మెటాను కేంద్రం ఆదేశించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉండే కంటెంట్‌కు ఆయా సంస్థలే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. భారత చట్టాలకు అనుగుణంగా మెటా ప్లాట్‌ఫామ్‌లు ఎంత మేరకు పనిచేస్తున్నాయనే దానిపై అధికారులు ప్రతినిధులను ప్రశ్నించారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ రికమండేషన్ అల్గోరిథమ్‌ల పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కేంద్రం వ్యక్తం చేసిన ఆందోళనలపై మెటా స్పందిస్తూ, తమ ప్లాట్‌ఫామ్‌లలో డీప్‌ఫేక్‌ల వంటి హానికర కంటెంట్‌ను గుర్తించి నియంత్రించేందుకు పలు విధానాలు, సాంకేతిక పరిష్కారాలు ఉన్నాయని తెలిపింది. సమావేశాల ఫలితాలను సమీక్షించిన అనంతరం తదుపరి చర్యలపై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. ఇతర ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కూడా భారత చట్టాలను పాటిస్తున్నాయా అనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఓ వీడియోను ఫేస్‌బుక్ కొంతకాలం నిలిపివేసిన ఘటనకు సంబంధించి సమన్లు జారీ కావడంతో మెటా గ్లోబల్ అఫైర్స్ హెడ్ జోయెల్ కప్లన్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం భారత్‌కు వచ్చింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పాటు పలువురు అధికారులు మెటా ప్రతినిధులతో విస్తృతంగా చర్చలు జరిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!