

బెంగళూరులో అత్యంత రద్దీగా ఉండే హెన్నూరు-బాగలూరు రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలను తగ్గించి, కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించేందుకు కర్ణాటక ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఈ మార్గంలో సుమారు ఏడాదిన్నరగా కొనసాగుతున్న వైట్ టాపింగ్ పనుల్లో జాప్యంపై వాహనదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో బెంగళూరు అభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ క్షేత్రస్థాయిలో పర్యటించారు. పెండింగ్ పనులను రాబోయే రెండు నెలల్లో పూర్తి చేయాలని, రహదారి విస్తరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
హెన్నూరు జంక్షన్ నుంచి గెద్దలహళ్లి వరకు జరుగుతున్న పనులను కేఆర్ పురం ఎమ్మెల్యే బైరతి బసవరాజ్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోకుండా డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాలని, వరదనీటి కాలువలను పునరుద్ధరించాలని, ఫుట్‌పాత్‌లను మెరుగుపరచాలని సూచించారు. పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించేందుకు హెన్నూరు-బాగలూరు మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. ఈ ప్రతిపాదన సాధ్యం కాకపోతే ప్రధాన సిగ్నల్ జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు నిర్మించే అవకాశాన్ని పరిశీలిస్తారు. రాబోయే ఐదేళ్లలో ఈ మార్గాన్ని సిగ్నల్ రహితంగా తీర్చిదిద్దడం, విమానాశ్రయానికి ప్రయాణాన్ని సులభతరం చేయడం ప్రభుత్వ లక్ష్యంగా ఉందని మంత్రి తెలిపారు. తుది నిర్మాణ ప్రణాళిక సాధ్యాసాధ్యాల అధ్యయనం, ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!