

ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఆరు పురస్కారాలు దక్కాయి. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యం, పరిశుభ్రత మెరుగుదలకు చేపడుతున్న చర్యలకు ఈ గుర్తింపు లభించింది. ఈ అవార్డులను అందుకునేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన పురస్కారాలను స్వీకరించనున్నారు. అవార్డులు సాధించిన మున్సిపాలిటీల కమిషనర్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి నగరపాలక సంస్థలతో పాటు కుప్పం మున్సిపాలిటీకి ఈ అవార్డులు దక్కాయి. సూపర్ స్వచ్ఛ లీగ్ విభాగంలో విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరపాలక సంస్థలు పురస్కారాలు సాధించాయి. ప్రామిసింగ్ స్వచ్ఛ షెహర్ విభాగంలో రాజమండ్రి గుర్తింపు పొందగా, సఫాయి మిత్ర సురక్షిత్ షెహర్ విభాగంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అవార్డు దక్కించుకుంది. 20 వేల కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల విభాగంలో కుప్పం మున్సిపాలిటీ స్వచ్ఛ సిటీ అవార్డును సాధించింది. మున్సిపల్ శాఖ చేపడుతున్న పారిశుధ్య చర్యలతో రాష్ట్రానికి వరుసగా అవార్డులు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!