

నవంబర్ 12, 13 తేదీల్లో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు విశాఖపట్నం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అంతర్జాతీయ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, ఆతిథ్యాన్ని పరిచయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సదస్సు ప్రాంగణంలో గిరిజన థింసా నృత్యం, గరగ నృత్యం, తప్పెట గుళ్లు వంటి సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించనున్నారు. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, తోలుబొమ్మలాట, కూచిపూడి కళల ప్రత్యేకతను చాటిచెప్పేలా అలంకరణలు చేపట్టారు. ఏపీ తీర ప్రాంత అందాలు, స్థానిక ఆహార రుచులు, అమరావతి వైభవం, నూతన రాజధాని ప్రత్యేకతలు, కడియం నర్సరీలను ప్రతిబింబించేలా కళాకృతులను ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలోని వనరులు, పెట్టుబడులకు అనువైన రంగాలను అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు పరిచయం చేసేందుకు ప్రత్యేక స్టాళ్లను సిద్ధం చేశారు. వ్యవసాయం, ఉద్యాన పంటలు, అరకు కాఫీ, పర్యాటకం, లాజిస్టిక్స్, సౌర విద్యుత్ రంగాల్లోని అవకాశాలను వీటిలో ప్రదర్శించనున్నారు. సదస్సు కోసం ప్రధాన ప్లీనరీ హాల్‌తో పాటు వివిధ సమావేశ మందిరాలను ఏర్పాటు చేశారు. ప్రముఖ కంపెనీల చైర్మన్లు, సీఈఓలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపేందుకు ప్రత్యేక హాల్‌ను సిద్ధం చేశారు. బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ), గవర్నమెంట్ టు బిజినెస్ (జీ2బీ) సమావేశాలు, పెట్టుబడి భాగస్వామ్యాలు, ఒప్పందాల కోసం ప్రత్యేక వేదికలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒకేసారి రెండు, మూడు కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రారంభ, ముగింపు కార్యక్రమాలు, ఆరు కీలక అంశాలపై చర్చలకు సన్నాహాలు చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!