

విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోల్‌కతాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. వీసా స్టీల్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ అగర్వాల్, ఇమామీ గ్రూప్ డైరెక్టర్ ఆదిత్య అగర్వాల్, శ్రీ సిమెంట్స్ వైస్ చైర్మన్ ప్రశాంత్ బంగూర్‌లతో భేటీ అయిన లోకేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను ప్రశంసించారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరియు పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.
ప్రపంచ స్థాయి ఓడరేవులు, మెరుగైన లాజిస్టిక్స్, భూమి, విద్యుత్ లభ్యత, పెట్టుబడిదారులకు అనుకూల విధానాలతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోని ప్రముఖ తయారీ మరియు పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని లోకేష్ తెలిపారు. అనకాపల్లి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ చురుకైన విధానాలను అభినందిస్తూ, మరింత సహకారం అందించేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!