

క్రిస్మస్, సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో సామాన్యులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే సరుకులు అందించాలని నిర్ణయించింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చౌక ధరల దుకాణాల ద్వారా రాయితీ ధరలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా కిలో కందిపప్పును రూ.100కు, లీటర్ పామాయిల్‌ను రూ.125కు, కిలో గోధుమ పిండిని రూ.25కు అందించనున్నారు. పండుగల సమయంలో కుటుంబాలకు అవసరమైన సరుకులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది.
డిసెంబర్ నుంచి వరుసగా మూడు నెలల పాటు ఈ ప్రత్యేక పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకం కోసం మూడు నెలల కాలంలో ప్రభుత్వంపై సుమారు రూ.300.60 కోట్ల ఆర్థిక భారం పడనుంది. ఈ మేరకు రాష్ట్ర సివిల్ సప్లయీస్ కమిషనర్, ప్రభుత్వ ఎక్స్-అఫీషియో కార్యదర్శి కె.కన్నబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పండుగల సమయంలో నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులకు భారంగా మారకుండా చూడటంతో పాటు రేషన్ కార్డుదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!