

తమిళనాడులోని మదురైలో భారీ నగల చోరీ జరిగింది. కలవాసల్ బైపాస్ రోడ్డులో కొత్తగా ప్రారంభమైన తనిష్క్ షోరూమ్‌లోకి గుర్తుతెలియని దుండగులు చొరబడి సుమారు 16 కిలోల బంగారం, వజ్రాభరణాలను దోచుకెళ్లారు. చోరీకి గురైన ఆభరణాల విలువ దాదాపు రూ.25 కోట్లు ఉంటుందని అంచనా. ఈ షోరూమ్ కార్యకలాపాలు పది రోజుల క్రితమే ప్రారంభమైనప్పటికీ, అధికారికంగా ప్రారంభోత్సవం జరగలేదు. ఇంటీరియర్ పనులు కూడా కొనసాగుతున్నాయి. నవంబర్ 10 రాత్రి సిబ్బంది ఎప్పటిలాగే దుకాణానికి తాళం వేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం తిరిగి వచ్చి చూడగా వెనుక వైపు తలుపులు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. లోపల ఉన్న నగల పెట్టెలు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఎస్ఎస్ కాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. షోరూమ్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, భవనం వెనుక భాగం నుంచి ఓ దుండగుడు లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారు. పోలీసులు వేలిముద్రలు, ఇతర ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించడంతోపాటు జాగిలాలతో గాలింపు చేపట్టారు. షోరూమ్‌లో నిల్వ ఉన్న మొత్తం బంగారంలో సుమారు 30 శాతం చోరీకి గురైనట్లు మదురై నగర పోలీస్ కమిషనర్ రాజేంద్రన్ వెల్లడించారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!