

ఇ20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం కలిగిన పెట్రోల్) ఇంధనంపై కొత్త వివాదం చెలరేగింది. వాహన తయారీదారుల సమాఖ్య సియామ్ (సియామ్) ప్రకారం, ఇ20 ఇంధనంలో అధిక క్లోరైడ్ స్థాయులు ఉండటం వల్ల ఇంధన ఇంజెక్టర్లు, ఫ్యూయల్ పంపులు, ఈజీఆర్ వాల్వులు, ఎగ్జాస్ట్ వ్యవస్థలు వంటి కీలక ఇంజిన్ భాగాలు తుప్పు పట్టి శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇంధనంలో క్లోరైడ్‌కు తప్పనిసరి పరిమితులు నిర్ణయించాలని, చమురు మార్కెటింగ్ కంపెనీలు తమ రిటైల్ బంకుల్లో నాణ్యతా నియంత్రణలను మరింత కఠినంగా అమలు చేయాలని పెట్రోలియం శాఖకు లేఖ రాసింది. వాహనాల ట్యాంకుల నుంచి సేకరించిన ఇంధన నమూనాల్లో క్లోరైడ్ స్థాయులు 500 మి.గ్రా./కేజీ వరకు, రిటైల్ అవుట్‌లెట్ల నమూనాల్లో 350 మి.గ్రా./కేజీ వరకు నమోదయ్యాయని సియామ్ పేర్కొంది.
దీనిపై స్పందించిన పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఇంధన నాణ్యతపై రాజీ లేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 87 వేలకుపైగా ఇంధన బంకుల్లో రోజుకు 8 నుంచి 12 సార్లు నీటి శాతం పరీక్షలు నిర్వహిస్తున్నామని, 2 వేలకుపైగా నమూనాల్లో క్లోరైడ్, సల్ఫైడ్ పరీక్షలు చేయగా కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే అధిక క్లోరైడ్ గుర్తించామని తెలిపింది. ఆ రెండు అవుట్‌లెట్లలో వెంటనే ఇంధన విక్రయాలు నిలిపివేసినట్లు వెల్లడించింది. ఇ20 ఇంధనానికి తమ పూర్తి మద్దతు ఉందని, అయితే నాణ్యతా ప్రమాణాలు మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని సియామ్ మరోసారి స్పష్టం చేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!