

ఆహార వస్తువుల ధరలు పెరగడంతో గత ఏడాది డిసెంబరులో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠ స్థాయైన 1.33 శాతానికి చేరుకుంది. గత ఏడాది అక్టోబరులో ఇది రికార్డు కనిష్ఠమైన 0.25 శాతంగా ఉండగా, నవంబరులో 0.71 శాతంగా నమోదైంది. అయితే 2024 డిసెంబరులో రిటైల్ ద్రవ్యోల్బణం 5.22 శాతంగా ఉండటం గమనార్హం. ఈ గణాంకాలను జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) సోమవారం విడుదల చేసింది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారంగా లెక్కించే ఈ ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యమైన 4 శాతం కంటే దిగువనే కొనసాగుతోంది.
డిసెంబరులో ఆహార ద్రవ్యోల్బణం -2.71 శాతంగా నమోదైంది. వరుసగా ఏడో నెల కూడా ఆహార ద్రవ్యోల్బణం ప్రతికూలంగానే కొనసాగుతోంది. కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపలు, సుగంధ ద్రవ్యాలు, పప్పుల ధరలు పెరగడంతో అక్టోబరు–నవంబర్‌తో పోలిస్తే డిసెంబరులో ఆహార ద్రవ్యోల్బణం కొంత పెరిగింది.
పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 2.03 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 0.76 శాతంగా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే కేరళలో అత్యధికంగా 9.49 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. కర్ణాటక (2.99%), ఆంధ్రప్రదేశ్ (2.71%), తమిళనాడు (2.67%), జమ్మూ కశ్మీర్ (2.26%) తదితర రాష్ట్రాల్లో కూడా ద్రవ్యోల్బణం ఉంది. కాగా అస్సాం, బిహార్, హరియాణా, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో డిఫ్లేషన్ నమోదైంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!