

అనిశ్చిత మార్కెట్ పరిస్థితులు, వ్యూహాత్మక కారణాలతో ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ అనుబంధ సంస్థ ప్రెస్టీజ్ హాస్పిటాలిటీ వెంచర్స్ లిమిటెడ్ (పీహెచ్‌వీఎల్) తన హోటల్ వ్యాపారానికి సంబంధించిన రూ.2,700 కోట్ల ఐపీఓ ప్రణాళికను ఉపసంహరించుకుంది. పీహెచ్‌వీఎల్ 2025 ఏప్రిల్‌లో సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది. తాజాగా కంపెనీ బోర్డు డీఆర్‌హెచ్‌పీని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. భవిష్యత్తులో మార్కెట్ పరిస్థితులు అనుకూలిస్తే కొత్త డీఆర్‌హెచ్‌పీని దాఖలు చేసే అవకాశముందని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది ఆగస్టులో కెనడాకు చెందిన సీపీపీఐబీ తమ ఆతిథ్య విభాగంలో రూ.3,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రకటించింది.
మరోవైపు పలు కంపెనీలు ఐపీఓల కోసం సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేశాయి. కోల్‌కతాకు చెందిన అన్మోల్ ఇండస్ట్రీస్ రూ.1,800 కోట్ల ఐపీఓకు, జే ఇన్‌ఫ్రాటెక్ రూ.600 కోట్ల తాజా షేర్ల జారీతోపాటు ప్రమోటర్ల ఓఎఫ్‌ఎస్‌తో కూడిన ఐపీఓకు దరఖాస్తు చేశాయి. అరేటే 22 లిమిటెడ్ రూ.440 కోట్ల తాజా షేర్ల జారీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది. బాంగంగా గోల్డ్ అండ్ డైమండ్ రూ.720 కోట్ల ఐపీఓలో భాగంగా రూ.540 కోట్ల తాజా షేర్ల జారీ, రూ.180 కోట్ల ఓఎఫ్‌ఎస్‌ను ప్రతిపాదించింది. డియాన్ ఎనర్జీ కూడా ఐపీఓ కోసం ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఇక విశాల్ నిర్మితి ఐపీఓ సెప్టెంబర్ 30న ప్రారంభమై అక్టోబర్ 5న ముగియనుంది. ధరల శ్రేణిని రూ.208–220గా నిర్ణయించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!