

భారత విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని విదేశీ పెట్టుబడిదార్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన పంపిన సందేశాన్ని భారత్ ఎలక్ట్రిసిటీ సమిట్–2026లో కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ చదివి వినిపించారు. “భారత్లో తయారీ, పెట్టుబడులు, ఆవిష్కరణలకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. భారత్తో కలిసి అభివృద్ధి చెందేందుకు విదేశీ పెట్టుబడిదార్లను స్వాగతిస్తున్నాం” అని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ తన ఇంధన రంగంలో కీలక దశలో ఉందని ఆయన తెలిపారు.
భారత్ వృద్ధికి దోహదపడే అర్థవంతమైన చర్యలు, భాగస్వామ్యాలకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నాణ్యమైన విద్యుత్ అందించేందుకు మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో సాధించిన పురోగతి దేశ నిబద్ధతకు నిదర్శనమని, ఇప్పటికే 50 శాతం సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించినట్లు తెలిపారు. 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకునే దిశగా కృషి కొనసాగుతున్నదని స్పష్టం చేశారు.
ఇక 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం, అలాగే 2034-25 నాటికి 97 గిగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించేందుకు వచ్చే రెండు దశాబ్దాల్లో సుమారు 2.2 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమని పంకజ్ అగర్వాల్ పేర్కొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!