

గూగుల్ సీఈఓ సుందర్ పిచై వేతన ప్యాకేజీకి భారీ పెంపు లభించింది. గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ ఆయనకు వచ్చే మూడు సంవత్సరాల కాలానికి మొత్తం 692 మిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీని మంజూరు చేసింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.6,361 కోట్లకు సమానం. ఈ విషయాన్ని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది.
ఈ ప్యాకేజీలో వార్షిక జీతం 2 మిలియన్ డాలర్లుగా ఉండగా, పెర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్స్ (PSU) విలువను 126 మిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. కంపెనీ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్న మేరకు ఈ మొత్తం మారవచ్చు. అదనంగా 84 మిలియన్ డాలర్లు పరిమిత స్టాక్ వెస్టింగ్ రూపంలో అందుకోనున్నారు. అంటే కంపెనీ ఉద్యోగికి మంజూరు చేసే షేర్లు పదవీకాలం పూర్తయ్యాక లేదా పనితీరు ఆధారంగా ఉద్యోగికి బదిలీ అవుతాయి. అలాగే ఆల్ఫాబెట్ అనుబంధ సంస్థలు అయిన వ్యోమో (Waymo), వింగ్ ఏవియేషన్ (Wing Aviation) సంస్థల్లో కూడా 175 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు కేటాయించారు. పిచై నాయకత్వంపై ఉన్న విశ్వాసానికి ఈ ప్రోత్సాహకాలు నిదర్శనమని ఆల్ఫాబెట్ బోర్డు తెలిపింది. ఏఐ ప్రభావంతో టెక్ ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో పిచై పై నమ్మకంతో ఈ వేతన పెంపును ప్రకటించినట్లు పేర్కొంది.
2004లో గూగుల్‌లో చేరిన సుందర్ పిచై, 2015లో సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో గత దశాబ్ద కాలంలో కంపెనీ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది. 535 బిలియన్ డాలర్ల నుంచి 3.6 ట్రిలియన్ డాలర్లకు చేరి దాదాపు ఏడు రెట్లు పెరిగింది. ఈ ఏడాది జనవరిలో ఒక దశలో కంపెనీ మార్కెట్ విలువ 4 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను కూడా తాకింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!